సిద్ద విద్య


సిద్ధ విద్య నాశనము లేని విద్య

సిద్ద విద్య అనగా మన దేహము, మనస్సు, ఆత్మలను పరిశుద్ధ పరిచి, కాంతిగా మార్చి, ఆ ప్రకాశమును పరమాత్మతో ఐక్యము చేయుట అగును

  1. ఈ విద్యను అభ్యసించిన, మృత్యరహితుడై కాంతి శరీరమును పొంది మరణమును జయించవచ్చును. దీని కొరకు "వాసి" యోగం చేసి 72,000 నాడి నరములను శుభ్రపరచవలెను. అట్లు చేసి కాంతి శరీరము పొందిన అదే "ముక్తి" స్థితి అగును. దాని తర్వాత మరణము లేదు. దీనినే మరణములేని విద్య అందురు.
  2. ఈ జన్మలో కొందరు కొన్ని అత్యున్నత చదువులను చదివెదరు. వారు మరణించిన తరువాత తదుపరి జన్మలో ప్రారంభ విద్య నుండి అభ్యసించవలెను. అయితే సిద్ద విద్యను ఒకరు నేర్చుకొనునప్పుడు ఇతర పరిస్థితులు, దేహారోగ్య కారణముగా మరణించిన యెడల, ముందటి జన్మలో 35000 నాడి నరములను శుబ్రపరచియుండిన యెడల, తదుపరి జన్మలో 35000 నాడి నరములనుండి యోగం ప్రారంభమగును. అందువలన గత జన్మలో నేర్చుకొనిన సిద్ధవిద్య ఈ జన్మలో సిద్ధించుట వలన అది మరణము లేని, నాశనము లేని విద్య అగును.
  3. ఒకరు ఈ జన్మలో సిద్ద విద్య నేర్చుకొనునప్పుడు ప్రాణ శక్తిని అభివృద్ధి పరచి దేహమును శుభ్రపరచునప్పుడు, మన దేహము కాంతి దేహముగా ఏర్పడిన మరణము లేదు. అందువలన మరణము లేనందున ఇది మరణము లేని విద్య అగును. .

శ్వాసము

శ్వాసము అనగా ఉచ్చ్వాసనిశ్వాసములు, అనగా గాలిని లోపలికి పీల్చి వెలుపలకు వదలుట అని అందురు. ముక్కు యొక్క రెండు నాసికల ద్వారా శ్వాస జరుగుతున్నది. కుడినాసిక ద్వారా జరుగు శ్వాసమును సూర్యనాడి అనియు, ఎడమనాసిక ద్వారా జరుగు శ్వాసమును చంద్రనాడి అని అందురు. శ్వాసము కుడినాసిక ద్వారా 90 శాతము జరుగునప్పుడు, ఎడమనాసికలో 10 శాతము జరుగును. అప్పుడు శరీరములో ఉష్ణతత్త్వము ఉండును. అందువలన దీనిని సూర్యనాడి అని అందురు. ఇదే విధముగా ఎడమనాసిక ద్వారా 90 శాతము జరుగునప్పుడు కుడినాసిక నుంచి 10 శాతము శ్వాస జరుగును. అప్పుడు శరీరము శీతల స్థితి కలిగి, సరాసరి ఉష్ణోగ్రత ఉండును. అందువలన దీనిని చంద్రనాడి అని అందురు. రెండు నాసికల ద్వారా సరిసమానముగా జరిగే శ్వాసను సుషుమ్ననాడి అని అందురు. ఈ శ్వాస జరిగేటప్పుడు శీతల స్థితి లేకుండా అధిక ఉష్ణస్థితి ఉండును. అందువలన దీనిని సుషుమ్ననాడి అని అందురు.

ఈ మూడు విధములైన శ్వాసలు మన శరీరములో పూర్తిగా వ్యాపించుచున్నవి. సూర్యనాడి ముక్కు యొక్క కుడినాసిక ద్వారము నుండి ఎడమకాలు వరకు 16 స్థానములు అనగా మొత్తం 32 స్థానములు ఎక్కిదిగుచున్నది. ఆ విధముగనే చంద్రనాడి శ్వాస ముక్కు యొక్క ఎడమనాసిక ద్వారము నుండి ప్రారంభమయి, కుడికాలు వరకు 16 స్థానములు అనగా మొత్తం 32 స్థానములు ఎక్కిదిగుచున్నది. కాని సుషుమ్ననాడి ముక్కు మొదలు కాళ్ళ వరకు దేహమంతా వ్యాప్తి జరుగుతున్న్నది. ఇవే మన శరీరములోని మూడు శ్వాస ప్రక్రియలగును.

Top


ప్రాణాయామము:

సాధారణముగా వాడుకలో ప్రాణాయామము అంటే శ్వాసను సక్రమముగా చేయు ఒక పద్ధతి అని అనుకొందురు. అనగా, మూడు విధములైన శ్వాసలను సరిసమానముగా (ఒకే విధముగా) నడుపుటను ప్రాణాయామము అని అనుకొందురు.

దీని కారణముగా శరీరమునకు గాలి నుండి లభించు ప్రాణశక్తి హెచ్చుస్థాయిలో నుండునని అనుకొందురు. ఇది నిజముగా ప్రాణాయామము అనుట కన్నా చక్కని శ్వాససాధన అని ప్రజలు అనుకొని నడుచుట, దేహాభ్యాసము, సైకిల్ త్రొక్కుట, యోగాసనము మొదలగు అభ్యాసములను చేయుచున్నారు. ఎందువలననగా పైన పేర్కొనబడిన అభ్యాసముల వలన శ్వాసక్రియ చక్కగా జరిగి దేహారోగ్యమునకు సహాయపడుచున్నవి.

అయితే నిజముగా ప్రాణాయామమనిన శ్వాసక్రియ సక్రమముగా జరుగుటకు ఉపయోగపడునదిగాకాక, దేహము, మనస్సు, ప్రాణము, ఆత్మ మొదలగు అన్నిటిని సక్రమముగా నడుపుటకు సహాయపడు ఒక సాధనగా ఉన్నది. అయితే కామము, కోపము, క్రోధము, ఈర్ష్య మొదలగునవి ద్వారా శ్వాసక్రియ సక్రమముగా జరుగుటకు వీలు లేకున్నది. అందువలన మనకు ప్రాణశక్తి తగ్గుతున్నది.

మన శరీరములో ఇడా, పింగళ, సుషుమ్నయను మూడు నాడులున్నవి. ఈ మూడింటిని ఒకటిగా చేసే శ్వాసక్రియ, అనగా ప్రాణాయామ సాధన చేయునపుడు ప్రాణశక్తి ఆ శ్వాసలో కలిసి శరీరమంతయు వ్యాపించి అన్ని నాడులను, నరములను, అవయవములను బలముగా చేయుచున్నది. దీని వలన శరీరమునకు ఆరోగ్యము సంప్రాప్తించుచున్నది. ఈ అభ్యాసములో మిగతా సాధనాల కన్నా ప్రాణశక్తి అధికముగా దేహమునకు అందుచున్నది.

అందువలన మనస్సుకు కామము, కోపము, క్రోధము, ఈర్ష్య మొదలగువానిని నియత్రించి వుంచుటకు సహాయపడుతున్నది. అందువలన పైనుదహరించిన అరిషడ్వర్గముల ద్వారా ప్రాణశక్తి క్షీణించదు. అందువలన శ్వాసలో ప్రాణశక్తిని కలుపు సాధన ప్రాణాయామమని పేర్కొనిరి. ఈ సాధనను సిద్దులు చేయుచుందురు. వాళ్ళ భాషలో దీనిని "వాసి" అని అందురు. అందువలన ఈ ప్రాణాయామమును మేము కూడా "వాసి" అనియే పిలిచెదము.

Top


మనస్సు:

మనస్సు అనగా పంచభూతములలో ఒకటైన వాయువు (గాలి) అగును. గాలి ఎలా ఈ భూమి చుట్టూ కవచముగా ఉన్నదో, ఆ విధముగా మన మనస్సు దేహమును, దేహానుభవములను చుట్టిఉండును. అందువలన అన్ని రకముల అనుభవములు , క్రియలు, పంచేద్రియాలు మనస్సు మూలముగానె పనిచేయిచున్నవి . ఈ మనస్సే చూచుచున్నది, వినుచున్నది, వాసన కనుగొనుచున్నది, రుచి ఎరుగుచున్నది, స్పర్శ గ్రహించుచున్నది. ఈ విధముగా పనిచేయు మనస్సు ఒకొక్క జన్మలో ఒక్కొక్క అనుభవాన్ని పొందుతుంది..

ఈ విధముగా ఒక్కొక్క దశలోను ఒక్కొక్క అనుభవమును గ్రహించి, మనవ జీవితములో ఆరవ తెలివిని పొందుచున్నది. ఆరవ తెలివి చింతించుట అనగా మనస్సును ఏకాగ్రత జేసి, దాని యొక్క శక్తిని తెలిసికొనుట. ఇదే ఆరవ తెలివి. ఈ తెలివిని సంపూర్ణముగా పొందుటకు ప్రాణాయామము, ధ్యానము చేయవలెను. వీటి అన్నిటికి కారణము మనస్సు.

కావున ఈ స్థితి పొందని మానవులు మృగముల మాదిరి తినుట, నిద్రించుట అను ఆలోచన లేని విషయములలో మునిగి తేలుదురు. ఈ విధముగా ఎందుకనగా, మానవుని ప్రయాణము ఒక అణువు మొదలు ఇష్టాఇష్టాలు, ఆశలు ద్వార జరుగుతూ వచ్చి మనుష్యుడు అయిన తర్వాత ఆ స్థితి నుంచి తప్పించుకొనక, ఆ స్థితి యందె కొనసాగుతున్నది. అందువలన మానవ జీవితములో వాని మనస్సు కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, డంబము, ఈర్ష్య, మోహము అను ఈ ఎనిమిది అవస్థలను, పంచేద్రియాలుతో కలిసి తన వశములో ఉంచుకొనుచున్నది.

అందువలన మనస్సును వీటినుండి విడిపించుటయే ఆరవ బుద్ధి (తెలివి) యొక్క పని. మానవుడు దీనిని ఉపోయోగించనంత వరకు మృగత్వములో జీవించుచున్నట్లు పరిగణించబడుతున్నది. అందువలన ఈ భాగ్యములను మనసు మిగతావాళ్ళు దగ్గర ఉపయోగించి సుఖమును పొందుతున్నది. అందువలన మానవుడు తన స్థితి నుంచి ఎదుగుటకు పంచాతన్మాత్రలగు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులను, అంతఃకరణ చతుష్టయమగు మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారమును తన యొక్క నియంత్రణలో ఉంచుకొనవలెను. అప్పుడు మనస్సు యొక్క శక్తి, దైవత్వమును గ్రహించి తన యొక్క స్థితిని పెంపొందించుకొనగలడు. ఇది మనస్సు యొక్క పని అగును.

గమనిక: మానవునకు కామము మీద ఎక్కువ ఎందుకనగా, అన్ని జన్మలలో తన స్వజాతీయ వంశాభివృద్ధి కొరకు కామమును అశ్రయించి ఉండుటయే దీనికి కరణము. అందువలన మనవ జన్మలో కూడా అదే స్థితిలో ఉన్నందున దైవత్వాన్ని తెలుసుకోనలేక తపించుచున్నది. .

సంతోషము - మనస్సు యొక్క చర్య

అందరూ వారి వారి జీవితములో సంతోషముగా ఉండుటకు అభిలషించుచున్నారు. అందువలన ఆ సంతోషము ప్రాపంచిక వస్తువులలో తద్వారా ప్రాపంచిక విషయములలో నున్నదని బ్రమపడుచున్నారు. అయితే ఆ వస్తువు, ఆ సంతోషాన్ని, కొన్ని నిమిషములు , కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని మాసములు కాని, కొన్ని సంవత్సరములు - అలా కొంత కాలమే ఇవ్వగలును. అందువలన ప్రపంచము ఈ రకముగా చాలా వస్తువులను తన దగ్గర ఉంచుకొని , పోటీ, ఈర్ష్య, దుఃఖములు, చెడ్డ ఆలోచనలు కల్పించి, సంతోషముగా ఉన్నట్లు భ్రమ కల్పించి మరణానికి తన ప్రయాణము సాగించుచున్నది.

ఈ ప్రాపంచిక జీవితములో ఒక ఇల్లుకొనుట, ఒక కారుకొనుట, మనకు అర్హతట అనుకొని విద్యావంతులు, విద్యాహీనులు పోటీ పడుట మానవుని అర్హతను నిర్ణయించదు. అయితే పోటీపడు గుణముతో, ఈర్ష్య, చెడ్డ ఆలోచనతో జీవించుచున్నారు. అయితే పోటీ, ఈర్ష్య చెడ్డ ఆలోచనలు లేకుండా, ఈ ప్రపంచ వస్తువులతోటి మిక్కిలి సంతోషముగా జీవించుటకు మనకు సరియైన స్థితిని మనము ఏర్పరచుకొనవలెను. ఈ అర్హత ఏమనగా మిగతా వస్తువుల ద్వారా కలిగే విషయములను వివేకుముతో విచారణ చేయు పరిపక్వత మనస్సుకు కావలయును.

ఈ మనస్సు పరిపక్వతకు మందు ఏమనగా మనస్సును ఏకాగ్రము చేయుట. మందు అని ఎందుకు తెల్పినానగా, సహజముగా మందు కొంచము చేదుగా ఉండును. అదే వ్యాధిని నిర్మూలించును. ఆ విధముగా ప్రపంచిక విషయముల నుంచి మనస్సును పక్వమోనర్చ కొనవలెను. అప్పుడు మనస్సు ఒక వస్తువు నుండి ఏర్పడు ఆలోచనలను బాగుగా విచారించి, దాని వలన కలుగు సుఖములను, దుఃఖములను, పోటీలను, ఈర్ష్యలు మొదలగునవి విచారించి నిర్ణయము తీసుకోనును. అప్పుడు మనకు సంతోషమైన పరిస్థితి ఏర్పడును.

అది ఎట్లనగా కోపము, ఈర్ష్య, చెడ్డ ఆలోచనలు దుఃఖము వీటిలో సంతోషమును చేర్చుకోనవలను. ఈ గుణములు ఉన్నా సంతోషమైన మనస్సు స్థితి ఏర్పడును. పోటీ, ఈర్ష్య, మనస్సులో ఉన్నాగాని దానిని వెంటనే తీసివేయుటకు ఈ సంతోషము సహకరించును. ఏ సంతోషమంటే మనస్సును ఏకాగ్రత జేయుటచే కలుగు సంతోషము (ఆనందము). ఈ స్థితిలో ఉంటె లౌకిక జీవితములో గెలుపు సాదించవచ్చును. జ్ఞాన జీవితమును పొందవచ్చును.

Top


మణి :

మణి అనునది యోగం అభ్యసించువారలకు ఒక ముఖ్యమైన అర్హతను నొసంగు స్థితి అగును.

మణి అనగా ఏమి?

మణి అనగా ఒక ఘన స్థితిలో నున్న ఒక వస్తువు అని మనకు తెలుసు. ఆ విధముగా మనము, మన మనస్సును ఒక ప్రదేశములో నిశ్చలముగా యుండునట్లు జేయునప్పుడు ఆ చోటులో మనస్సు గాలి రూపముగానుండును. అప్పుడు అక్కడ ప్రాణశక్తి, మనస్సు ఉన్న ప్రదేశములో వచ్చి చేరుతుంది. ఆ స్థితిని, ఆ ప్రాణశక్తిని మనము గ్రహించవచ్చును. అప్పుడు ఆ చోటులో మనస్సు ఒక గుండ్రటి బిందురూపమును ధరించుచున్నది. దాని పేరే మణి అని అందురు.

ఇది ఎట్లు ఏర్పడుచున్నదో తెలిసికొందుము. మొదట మనస్సును ఒక చోట నిలుపు నపుడు ఆలోచనలు నియంత్రించబడుతున్నవి. అప్పుడు ఒకే ఒక ఆలోచన మాత్రమే ఉండును. అది ఏమనగా, మనస్సును ఒక చోట నిలుపుచున్నాము అను ఆలోచనమటుకు ఉండును. మన నాసిక ద్వారా సంచరించు శ్వాస మెల్లగా శరీరములోపల సంచరించడం ప్రారంభమగును. అప్పుడు ప్రాణశక్తి ఆ చోట శ్వాసతో కలయును. దేహము కొంచము వేడిని పొందును. తర్వాత మన శరీరమును నడిపే పదివాయువులు (పంచ ప్రాణములు + పంచ ఉపవాయువులు) నెమ్మదిగా వేడిని గ్రహించి, ఆ వాయువులు ప్రాణశక్తిని పొంది అన్ని అజ్ఞాచక్రములో చేరుట వలన మనస్సు ఏకాగ్రత పొందుతుంది. అప్పుడు అవస్థలు తగ్గుటవలన ఆలోచనలు నియంత్రించబడుచున్నది. అందువలన మనము ఏ విషయములో కుడా రాగద్వేషము, ఇష్టాయిష్టాలు లేక నెమ్మదిగా పనిచేయుటకు వీలు కలుగుతున్నది. దీని వలన మన జీవితములో ఏర్పడు సమస్యలలో విజయమునుపొంది శాంత జీవితము గడుపుటకు సాధ్యమగును.

అందువలన మణి (బిందు) ఏర్పడుట జీవితము శాంతముగా గడుపుటకు, పరమాత్మ స్థితిని పొందుటకు మొదటి మెట్టు అగును.

Top


ప్రాణం:

పంచభూతముల యొక్క కలయికే ప్రాణము. నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశము వీటి మొత్తమైన కలయికలో నున్నటు వంటి అణువులు ఒకటై ఒక ప్రాణముగా ఏర్పడును. ఇది ఎట్లనిన, ఒక విత్తనమును భూమిలో వేసి నీరు పోసిన అది మొలకెత్తి పెరుగును. అది పెరగడానికి భూమి, నీరు, గాలి, ఆకాశము (ఎండ (ఉష్ణము), సూర్య రశ్మి, చంద్రకాంతి) అన్నియు కావలెను. దీనివలన ఒక ప్రాణి ఉత్పన్నమగుటకు పంచభూత శక్తి ఎట్లు సహాయపడుతున్నదో మనకు తెలియుచున్నది. పలు ప్రాణులుగా ఈ పంచభూత శక్తి మారి, చివరగా మానవుని రూపము ధరించుచున్నది.

అప్పుడు పంచభూతముల స్థితి ఏమనగా -- గాలి మనసుగాను, నీరు ప్రాణశక్తిగాను, నిప్పు శరీరమును నిర్వర్తించు శక్తిగాను, భూమి దేహముగాను, ఆకాశము ఆత్మ ఉండు చోటుగాను ఉండును. ఇదే మానవుని రూపము. ఇవి అన్ని చేరి ఒక మానవుని ప్రాణముగా ఏర్పడుతున్నవి.

Top